(Vaikunta Dwara Darshan) తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తిరుపతివాసుల కోసం ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. దాదాపు 5 వేల టోకెన్లు ఇవాళ అందివ్వనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని పలు ప్రాంతాల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ.. తిరుపతి వాసులకు ప్రత్యేక టోకెన్లు అందించారు. దాదాపు 5 వేల మంది టోకెన్లు అందించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల వద్ద సోమవారం ఉదయం 9 గంటల నుంచి టోకెన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. ఎక్కడ మిస్ అవుతామోనన్న బెంగతో పలువురు భక్తులు రాత్రి నుంచే పెద్ద ఎత్తున బారులు తీరారు. దాంతో టోకెన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాత్రి 9 గంటల నుంచే మొదలుపెట్టారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజుల పాటు కొనసాగించనున్నారు. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నారు.
భక్తులు భారీగా తరలిరావడంతో తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు అధికారులు టోకెన్ కౌంటర్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తోపులాటలు జరుగకుండా చూడాలని కింది స్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి ప్రశాంత వాతావరణంలో టోకెన్లు పొందాలని పోలీసు అధికారులు భక్తులకు విజ్ఞప్తిచేశారు. కాగా, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 11 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం నిర్వహిస్తున్నారు. దాంతో ఆరోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. మరోవైపు, రికమండేషన్ లెటర్లను అనుమతించి తమకు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరుతూ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలోని అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కార్యాలయం ఎదుట గుమిగూడారు. తాము చాలా దూరం నుంచి వచ్చామని, వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
యాస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..