తిరుమల : తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామివారి ఆరాధన విధానానికి వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రం (Vaikhanasa Bhagavata Shastra ) మూలమని పండితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం కశ్యప మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఖానస సభ కార్యదర్శి శ్రీనివాస దీక్షితులు, వైఖానస ట్రస్టు కార్యదర్శి ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథంతో శాస్త్రాధ్యయనం చేసి సమాజానికి సేవచేయాలన్నారు. ఆలయ సంస్కృతికి(Temple Culture) ఆధారమైన ఆగమశాస్త్రాల పరిరక్షణ సమాజం బాధ్యతగా స్వీకరించాలని కోరారు. జ్ఞానాన్ని అందించిన మహర్షుల జయంతులను పండుగలుగా జరుపుకుంటూ, ఆలయ సాంప్రదాయాలు పాటిస్తూ, భగవద్దర్శనంతో ప్రశాంత జీవనం పొందాలని సూచించారు.
వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధినీ సభ అధ్యక్షులు రాఘవ దీక్షితులు (Raghava Deeksutulu) మాట్లాడుతూ విఖనస మహర్షి, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల జ్ఞాన ఫలాలు నేటికీ సమాజాన్ని ధర్మమార్గంలో పయనింపజేస్తూ, సమాజాన్ని ఆలయ వ్యవస్థతో అనుసంధానం గావించిందని చెప్పారు. మానవాళిని మహోన్నత స్థితికి చేర్చే ఆరాధనా విధానం కశ్యప మహర్షి జ్ఞానకాండ గ్రంథంలో వివరించారని తెలిపారు. ఈ సభలో వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఆచార్యులు, ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.