Srisailam | లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం శుక్రవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో స్వామి అమ్మవార్లకు ఊయలసేవ జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పం పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు. అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపించారు. చివరగా ఊయలసేవ నిర్వహించారు. ఊయల సేవ సందర్భంగా స్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చన జరిపించారు. పుష్పాలంకరణకు పలు పుష్పాలు వినియోగించారు.
శ్రీశైల దేవస్థానానికి 22 రోజుల్లో రూ. 2,59,68,400 నగదు హుండీ ద్వారా ఆదాయం లభించింది. 2025 జనవరి తొమ్మిదో తేదీ నుంచి 30 వరకూ వచ్చిన హుండీ కానుకలను శుక్రవారం లెక్కించారు. ఈ నగదుతో పాటు 64. 200 గ్రాముల బంగారం, 3.170 కిలోల వెండి లభించాయి.
అలాగే 590 అమెరికా డాలర్లు, 100 చైనా యువాన్లు, ఐదు సౌదీ అరేబియా రియాల్స్, రెండు కువైట్ దినార్లు, పది కెనడా డాలర్లు, 1090 యూఏఈ దిర్హామ్‌లు, 14 సింగపూర్ డాలర్లు, ఒక ఖతార్ రియాల్, ఐదు యూరోలు, 23 మలేషియా రింగిట్స్, 45 యూకే ఫౌండ్లు, 240 ఆస్ట్రేలియా డాలర్లు, 30 రష్యా రూబుల్స్ లభించాయి. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో హుండీ విరాళాల లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.