తిరుపతి : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Gadkari ) గురువారం తిరుపతి ( Tirupati)లోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు ఉన్నాయని, ఇక్కడ నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు (Heart transplant surgeries ) చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చెన్నై, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవని అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు దాదాపు 1600 గుండె సంబంధిత శస్త్రచికిత్సలు ఉచితంగా చేశారని, దీన్ని భగవంతుని సేవగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా అవయవమార్పిడికి సంబంధించిన డాక్టర్ల కొరత ఉందని, మరింత మందికి శిక్షణ అవసరమని చెప్పారు.
ఆసుపత్రిలోని ఐసీయు, ఔట్‌పేషెంట్ విభాగం, ఆపరేషన్ థియేటర్లు, వార్డులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి ( TTD Chairman) , ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, ఈఈ కృష్ణారెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.