అమరావతి : ఐదేండ్ల అసమర్ధ వైసీపీ పాలనలో విద్యుత్ రంగం (Power sector) పూర్తిగా నాశనమైందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. విద్యుత్ రంగానికి రూ. 1,29, 500 కోట్లు నష్టం జరిగిందని , విద్యుత్ సంస్థలపై గత ఐదేళ్లలో రూ. 49,596 కోట్లను అప్పులు తెచ్చారని విమర్శించారు. అమరావతి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ రంగంపై చంద్రబాబు శ్వేతపత్రం ( White Paper ) విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేండ్లలో కోర్టు ఆదేశంతో నిర్వహణ ఛార్జీల కింద రూ. 9 వేల కోట్లు చెల్లించారని తెలిపారు. ట్రూ అప్, సర్ ఛార్జీలు, డ్యూటీ ఛార్జీలు పేరుతో ప్రజలపై అదనపు భారం వేశారని వివరించారు. ఇళ్ల వినియోగదారులపై 45 శాతం ఛార్జీలు పెంచి రూ. 32.166 కోట్లభారం ప్రజలపై వేశారని అన్నారు.
గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో పెట్టుబడులు రాలేదని, సౌరవిద్యుత్ పీపీఏల రద్దు నిర్ణయంతో రాష్ట్రం నష్టపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని వెల్లడించారు. 2014-19 వరకు టీడీపీ హయాంలో చేపట్టిన విద్యుత్ సంస్కరణలు దేశానికి ఆదర్శప్రాయంగా మారిందని అన్నారు. మొట్టమొదట రెగ్యులేటరీ కమిషన్ ఏపీలోనే వచ్చిందని గుర్తుచేశారు.