Srisailam Temple | శ్రీశైలం : ఈ నెల 27 నుంచి 31 వరకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లను బుధవారం ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు. క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉగాదికి కర్నాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించాలని ఆదేశించారు. క్యూలైన్లలో తొక్కిసలాటలు జరుగకుండా చూడాలని.. ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ విషయంలో పోలీసుశాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. భక్తులకు క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్స్ అందిస్తూ ఉండాలని.. రద్దీ సమయాల్లో శివసేవకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కర్నాటక నుంచి వచ్చే భక్తులకు కన్నడంలో ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా పాతాగంగ వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లను, షవర్స్, దుస్తులు మార్చే గదులు, బాత్రూమ్స్ను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న గజఈతగాళ్లతో మాట్లాడి.. వారికి పలు సూచనలు చేశారు. ఈవో వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డి, ఏఈవోలు మల్లికార్జునరెడ్డి, బీ స్వాములు, డిప్యూటీ ఇంజినీర్ వీపీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.