అమరావతి : ఎన్టీఆర్ (NTR District) జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ(Cement Factory) లో బాయిలర్ పేలిన ఘటనలో ( Boiler explode) ఇద్దరు కార్మికులు చికిత్సపొందుతూ మృతి చెందారు.
బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలతో పాటు మరో 10 మంది స్థానికులు ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఆదివారం ఒక్కసారిగా బాయిలర్ పేలింది.
దీంతో అక్కడే పనిలో ఉన్న 20 మంది గాయపడగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను జగ్గయ్యపేట , విజయవాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ వెంకటేశ్, అర్జున్ అనే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఏపీ సీఎం చంద్రబాబు ఆరా
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘటనపై స్పందించారు. బాధితులకు అండగా నిలబడాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పేలుడు ఘటనకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని సీఎం పేర్కొన్నారు