అమరావతి : ఆరుగాలం కష్టపడే రైతన్నలు ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్నారు. కొందరు ప్రమాదవాశాత్తు మరణిస్తుండగా మరికొద్ది మంది మానవతప్పిదాలు, సాంకేతిక సమస్యలతో మృత్యువాతకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా గురజాలలో ఇద్దరు రైతులు విద్యుదాఘాతంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
పొలంలో మోటారుకు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో శ్రీనివాసరావు(35), రామయ్య (65) అనే ఇద్దరు రైతులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని రోదించడం అక్కడికి వచ్చిన వారి కళ్లల్లో నీరు తెప్పించింది. విద్యుత్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.