అమరావతి : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం జిలా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన ముంజలు కొంటున్న వారిపైకి దూసుకెళ్లింది.ఈ సంఘటనలో శ్రావణ్(8), సుహాస్(6) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులు సోనాపతి, శ్రావణి తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనలో గాయపడ్డ పెద్దకన్నెపల్లికి చెందిన మరో బాలుడు సుషిత్ ( 8) పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఉంది.
వీరిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. మృతులు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కోనాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.