Srisailam | శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు చేసిన పాగాలంకరణ వస్త్రం ప్రతి భక్తునికి అందేలా అందుబాటులో ఉండేలా నిర్ణయించి కనీస ధరకు విక్రయశాలలో అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు ఈవో ఎస్ లవన్న చెప్పారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో కైలాస కంకణాల విక్రయశాలలో తొలుతగా పాగవస్త్రంతోపాటు పంచముఖి రుద్రాక్షలను కొనుగోలు చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్ లవన్న మాట్లాడుతూ మల్లన్నకు అత్యంత వైభంగా జరిగే పాగాలంకరణ ఘట్టంలో ఉపయోగించే వస్త్రాన్ని సామాన్య భక్తులకు కూడా అందించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే పంచముఖి, త్రిముఖి రుద్రాక్షలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శివప్రసాద్, ఏఈవో మోహన్, ఉపప్రధాన అర్చకులు శివశంకరయ్య, పర్యవేక్షకురాలు దేవిక, సీసీ జగదీష్ పాల్గొన్నారు.
శ్రీశైల మహా క్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రదోషకాల సమయంలో నందిమండపంలోని శనగల బసవన్నకు మల్లికాగుండంలోని శుద్దజలాలు, పంచామృతాలతో అభిషేకాలు జరిపించారు. నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న గోశాల సంరక్షణ నిధికి నెల్లూరు వాసి అరుంధతి రూ. లక్ష విరాళం అందజేశారు. సోమవారం ఆలయ పర్యావేక్షకుడు నాగరాజుకు రూ. లక్ష చెక్ అందజేశారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.