Tuni Missing Case | కాకినాడ జిల్లా తుని మండలంలో అడవిలోకి వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) కేసు రోజురోజుకీ మరింత మిస్టరీగా మారుతోంది. పది రోజులుగా వందలాది మంది పోలీసులు పాప కోసం గాలిస్తున్నా.. ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాప మిస్సింగ్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చిన్నారిని కిడ్నాప్ చేశారా? లేక అటవీ ప్రాంతంలో క్రూర జంతువు దాడి చంపిందా అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.
కొండచిలువలు లేదా ఇతర అడవి జంతువులు చిన్నారిని తీసుకెళ్లి ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నక్కలు లేదా వేటకుక్కల తరహా జంతువులు చిన్నారిని కొండ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉండవచ్చని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఈ ప్రచారానికి ఊతమిచ్చారు. చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) కొండచిలువ బారిన పడి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లోనే పాప సహా ఆనవాళ్లు కనిపించకుండా పోతాయని తెలిపారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం దీన్ని ఖండించారు. ఆ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాలు, ఇతర వన్యప్రాణులు దాడి చేసిన ఘటనలు నమోదైన దాఖలాలు లేవని అటవీ శాఖ అధికారి పట్టాభి స్పష్టం చేశారు.
చిన్నారి అదృశ్యమైన పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. ఈ కేసును అన్ని కోణాల్లో విస్తృతస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. కానీ ఇంతవరకు ఏ క్లూ దొరకలేదని.. సాంకేతిక ఆధారాలు కూడా లభ్యం కాలేదని పేర్కొన్నారు. అయితే అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పారు. చిన్నారి అదృశ్యమైన పరిస్థితిని బట్టి ముందస్తు ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేశారని అనుకోలేమని తెలిపారు. పాప తనకు తానే నడిచి వెళ్లిందని.. కేవలం 30 నిమిషాల్లోనే ఇదంతా జరిగిందని పాప తల్లిదండ్రులు చెబుతున్నారని అన్నారు. అడవిలో పాప కనిపిస్తే ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని.. ఇంకా దీనిపై స్పష్టత రాలేదని అన్నారు. హఠాత్తుగా ఏదో జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పాప మిస్సింగ్‌పై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. అది సరికాదని హితవుపలికారు. చిన్నారి వెంట వెళ్లొచ్చిన శునకం డీహైడ్రేట్ అయ్యి చనిపోయిందని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే మిగతా విషయాలు తెలుస్తాయన్నారు.