కాకినాడ: కాకినాడ జిల్లా తునిలో (Tuni) మనవరాలు వయస్సు బాలికపై లైంగికదాడి యత్నం కేసులో నిందితుడు చెరువులో శవమై తేలాడు. బుధవారం రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా నిందితుడు తాటిక నారాయణరావును (Narayana rao) తుని కోమటిచెరువులో దూకేశాడు. దీంతో గురువారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది. నారాయణరావుని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్లుండగా.. వాష్‌రూమ్‌కి వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ సమయంలో చెరువులోకి దూకేశాడని పోలీసులు చెప్పారు. అయితే నారాయణ రావు పారిపోవాలని చూశాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలాల్సి ఉంది.
కాగా, టీడీపీ నాయకులు తాటిక నారాయణరావు తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చి, హంసవరం సపోట తోటలోకి తీసుకెళ్లాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ అత్యాచారానికి యత్నించాడు. ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బాలికను రక్షించారు. ఈ ఘటనపై నారాయణరావును స్థానికులు నిలదీయగా.. మూత్ర విసర్జన కోసం బాలికను అక్కడకు తీసుకొచ్చానని నారాయణ రావు బుకాయించాడు. అయినప్పటికీ స్థానికులు గట్టిగా అడగడంతో నారాయణరావు రివర్స్‌లో బెదిరింపులకు దిగాడు. నేనెవరో తెలుసా.. టీడీపీ కౌన్సిలర్‌ను .. నన్ను ప్రశ్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.