TTD | తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటాం అని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. శ్రీవారి దర్శనంతోపాటు భక్తులకు వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందని మీడియాకు చెప్పారు. భక్తులకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భారీగా పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్న ప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదన్నారు. తగినంత మంది సిబ్బందిని నియమిస్తామని శ్యామలరావు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలను ప్రచారం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని శ్యామలరావు చెప్పారు. అందుకు అనుగుణంగా ఒక కమిటీ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ శ్రీవారి ఆలయం నిర్మిస్తామని వెల్లడించారు. స్విమ్స్ దవాఖానకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో స్విమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు.
టీటీడీ సేవలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించిందని శ్యామలరావు వెల్లడించారు. తిరుపతిలోని కంచి కామకోటి సంప్రదాయ పాఠశాలకు రూ.2 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఇక టీటీడీలో ఆహార భద్రతా బోర్డు ఏర్పాటు చేయడానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు.