తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. జూన్ నెలలో సుమారు 23 లక్షల మంది భక్తులు (Devotees) స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు (TTD Officials) వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) 116.14 కోట్లు వచ్చిందని టీటీడీ ఈవో వెల్లడించారు. 1.06 కోట్ల లడ్డూలను విక్రయించామని వివరించారు.
సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పుష్పపల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు విహరిస్తారని పేర్కొన్నారు. వసతి సముదాయాల డిపాజిట్లు (Deposits) ఏడు రోజుల్లో భక్తుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు . భక్తుల ఖాతాలల్లో జమ కాకపోతే టీటీడీని సంప్రదించాలని సూచించారు. రాత్రివేళ గాలిగోపురం నుంచి భక్తులు గుంపుగా గోవింద నామస్మరణ చేసుకుంటూ రావాలని అన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో వ్యర్థాలు వేసేందుకు చెత్త కుండీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఘాట్ రోడ్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని కలుగుతుందని వివరించారు. శ్రీవాణి ట్రస్టుపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈవో కోరారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటికే 9లక్షల మంది దర్శనం చేసుకున్నారని తెలిపారు. పార్వేట మండపాన్ని కూల్చివేశామని చేస్తున్న తప్పుడు ప్రచారం లో నిజం లేదన్నారు.