అమరావతి : తిరుపతిలో(Tirupati) జరిగిన తొక్కిసలాట ఘటనలో టీటీడీ విజిలెన్స్, పోలీసుల వైఫల్యమే కారణమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Ex-Chairman Bhumana) ఆరోపించారు . తిరుమలలో వైకుంట ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా 48 మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై ఆయన గురువారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వేలాది మంది భక్తులు టోకెన్ల కోసం కేంద్రాలకు రాగా కొద్ది మంది మాత్రమే అక్కడ పోలీసులు ఉండడంతో భక్తులను నియంత్రించలేకపోయారని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లపై నెలరోజులుగా రోజుకో సమీక్షను నిర్వహించి చివరకు చేతులెత్తేయడంతో ఘటన జరిగిందని విమర్శించారు.
పనిచేసేవారు తక్కువై, పర్యవేక్షించే వారు ఎక్కువయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఆర్బాటం ఎక్కువ, ఆచరణ తక్కువ ఉంటుందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ(TTD) సమర్దవంతంగా పనిచేసిందని గుర్తు చేశారు. భక్తులకు మేలైన నిర్ణయాలే తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.
ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీని రాజకీయ క్రీడా మైదానంగా మార్చివేశారని దుయ్యబట్టారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేనని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి, క్షతగాత్రులకు రూ. 20 లక్షల పరిహారాని చెల్లించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామన్న పవన్‌కల్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.