హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను స్వీకరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు. దీంతో కొన్నాళ్లుగా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతించడం లేదనే సమస్యకు చెక్ పడినట్టయింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశమై సిఫారసు లేఖల అంశంపై చర్చించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి నాలుగు సిఫారసు లేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. వారానికి రెండుసార్లు రూ.300 దర్శనం, రెండుసార్లు బ్రేక్ దర్శనానికి సంబంధించిన లేఖలకు అనుమతి ఇచ్చారు.