అమరావతి : తిరుపతి తొక్కిసలాట (Stampede) ఘటనపై టీటీడీ పాలక మండలి క్షమాపణ (Apologize) చెప్పాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో ఓ బాధ్యత గల వ్యక్తిగా ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పానని, తానే క్షమాపణ చెప్పినప్పుడు మీరు కూడా టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, ఏఈవో క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లు ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
బాధితుల ఆర్తనాధాలు వింటే బాధ ఏంటో అర్థమవుతుందని సూచించారు. క్షమాపణ చెప్పి తీరాలని, వేరే దారి లేదని అన్నారు. క్షమాపణ చెప్పటం వల్ల పోయిన ప్రాణాలు రావు కాని, మీరు కోరే క్షమాపణతో ప్రజలు గౌరవంగా ఫీలవుతారని అన్నారు. గరుడ ఉత్సవాలకు నాలుగు లక్షల మంది వస్తే విజయవంతంగా నిర్వహించగా కేవలం 2500 మంది ఉన్న స్థలంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల దురదృష్టకర ఘటన జరిగిందని అన్నారు.
హనీమూన్ పిరియడ్ అయిపోయింది
ఆరు నెలల హనీమూన్ పిరియడ్ అయిపోయింది. ఇప్పటివరకూ అధికారులను కూర్చొబెట్టి సమీక్షలు నిర్వహించా. ఇకపై సక్రమంగా పనిచేయని అధికారులను సహించే లేదని ఎక్కడికక్కడా నిలదీతలే ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15 ఏండ్ల పాటు కూటమితో కలిసి ఉండాలని శక్తి పీఠం వద్ద ప్రతిజ్ఞ చేస్తున్నానని అన్నారు. కాని అధికార యంత్రాంగం సహకారం కావాలని కోరారు. ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసని అన్నారు . తనకు అధికారం అలంకారం కాదని, బాధ్యతగా గుర్తించానని వెల్లడించారు.
పిఠాపురంలో శాంతి భద్రతలు భంగం వాటిల్లితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యత వాళ్లు సరిగా నిర్వహించినట్లయితే తిరుపతి లాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. ఒక్క అధికారి సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు క్షతగాత్రులు కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఫలితం అనుభవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తమ విధుల్లో లోపం రాకుండా పనిచేసినప్పుడే ప్రజలకు , ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రావని వెల్లడించారు. గత ప్రభుత్వంలో అలవాటుపడి కొంతమంది పనిచేయడం మానేశారని ఆరోపించారు.రాజ్యాంగం ఇచ్చిన విధులను సంపూర్ణంగా పరిరక్షించాలని, తప్పు చేసిన వారు ఎంతటి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు.
నిన్న తిరుపతి పర్యటనలో తనను చూసి కేరింతలు, ఈలలు కొట్టడాన్ని తప్పుపడుతూ యువత సందర్భోచితంగా వ్యవహరించాలని సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఈవ్ టీచింగ్ అనేది మరోసారి కనిపించవద్దని, ఆ దిశగా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నియోజకవర్గంలో నేరాలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ హయాంలో నడిచే డెయిరీలను మూసివేసిన నాయకులు సొంత డెయిరీలు ఏర్పాటు చేసుకున్నారని దుయ్యబట్టారు.