తిరుపతి : రసాయన ఎరువులు క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే ధ్యేయంగా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు టీటీడీ గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు టీటీడీ తరపున ఉచితంగా ఆవులు, ఎద్దులు ఇస్తున్నట్లు వెల్లడించారు.
గురువారం టీటీడీ గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులకు, రాష్ట్రంలోని నోడల్ గోశాలల నిర్వాహకులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి? ఆ ఉత్పత్తులను టీటీడీ ఎలా సేకరిస్తుంది? అనే అంశాలపై ఈ శిక్షణా కార్యక్రమంలో నిపుణులతో రైతులకు అవగాహన కల్పిస్తామని ఎస్వీ సుబ్బారెడ్డి చెప్పారు. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి గత ఏడాదిన్నరగా ప్రసాదాలు తయారు చేస్తున్నామని, ఇది శాశ్వతంగా కొనసాగేందుకు రైతులను గో ఆధారిత వ్యవసాయం వైపు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు రేవతి రమణ దాస్, టీటీడీ గో సంరక్షణ కమిటీ సభ్యులు రామ్ సునీల్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జేఈఓ లు శ్రీమతి సదా భార్గవి, వీర బ్రహ్మం, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, శ్వేతా డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి తదితరులు హాజరయ్యారు. గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న తిరుపతి జిల్లా డీవీ సత్రంకు చెందిన రైతులకు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 8 గోవులను ఉచితంగా అందించారు. గోవులను తీసుకుని వెళ్తున్న వాహనాన్ని ఈఓ ధర్మారెడ్డి, జేఈఓ లు శ్రీమతి సదా భార్గవి, వీర బ్రహ్మంతో కలసి జెండా ఊపి సాగనంపారు.