తిరుపతి: ఇటీవల ఏనుగుల గుంపు తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఫుట్పాత్లోకి ప్రవేశించడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో టీటీడీ అటవీ సిబ్బందితో పాటు అటవీశాఖ సిబ్బందికి అడవి ఏనుగులను అదుపు చేయడంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రముఖ ఏనుగుల మనస్తత్వవేత్త డాక్టర్ రుద్ర ఆదిత్య శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీలో ఏనుగులు మానవ సమాజంలోకి ప్రవేశించిన సంఘటనలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానంపై విజువల్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. మానవ ఆవాసాలలోకి దారితప్పి వచ్చే అడవి ఏనుగులను అదుపు చేయడంలో ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడనున్నది. ఏనుగులు జనవాసంలోకి వచ్చిన సందర్భాల్లో వాటిపై గట్టిగా అరవడంగానీ, రాళ్లతో కొట్టడంగానీ చేయకూడదని సూచించారు.
ఏనుగులను అడవిలోకి తరిమేయడానికి ఎండు మిరపకాయలు ఉన్న గోనె సంచులను వెదురు స్తంభానికి క్రమపద్ధతిలో కట్టి పొగ వెలువడేలా చేసి భయపెట్టవచ్చునని చెప్పారు. ఇలాంటి వాటిని ప్రతి 10 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం వల్ల ఏనుగుల గుంపును సులభంగా తరిమేయవచ్చునన్నారు. వర్షాలు కురిసే సమయాల్లో కూడా చెట్టుకు డబ్బాకట్టి అందులో పిడకలు, ఎండు మిరపకాయలు వేసి మంట పెట్టినా ఏనుగులు ఆ వాసనకు ముందుకు రావని వెల్లడించారు. తెలుపు, ఎరుపు రంగులు ఏనుగులకు ఆగ్రహం తెప్పిస్తాయని, అందువల్లే అడవుల్లో పనిచేసేవారు, సందర్శకులు ఎరుపు, తెలుపు రంగు వస్త్రాలు ధరించకుండా జాగ్రత్త పడాలన్నారు. ఏనుగు ఎదురు పడినప్పుడు భయంతో కేకలు వేయకుండా తెలివిగా తప్పించుకునే మార్గం చూడాలని, ఒకే దశలో కాకుండా జిగ్‌జాగ్‌గా పరిగెత్తాలని చెప్పారు. ఏనుగులు ఏ సమయంలో ఏ వాతావరణంలో ఎలాంటి మనస్తత్వంతో ఉంటాయని, వాటిని ఎలా డీల్ చేయాలి అనే విషయాలపై కూడా శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఇంచార్జ్ డీఎఫ్ఓ శ్వేత, డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, రేంజ్ ఆఫీసర్లు ప్రభాకర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, రఘురామిరెడ్డి, వివేకానంద తదితరులు పాల్గొన్నారు.