Tirumala Laddu | దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసీపీని సమూలంగా నాశనం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చాలా బలంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లడ్డూ కల్తీ అంశంపై సీబీఐతో గానీ.. సిట్టింగ్ జడ్జితో గానీ విచారణకు ఆదేశించే దమ్ముందా? అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు.
వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నాశనం చేశారని అబద్ధాలు చెప్పి చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన విజిలెన్స్ కమిటీ విచారణలో ఏమీ దొరక్కపోవడంతో శ్రీవారి లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఘోర అపచారం చేశారని.. దీనికి ఆ స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టరని అన్నారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారని దుర్మార్గమైన, నీచమైన ఆరోపణలు చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. లడ్డూపై అసత్య ప్రచారం చేసిన వారు రక్తం కక్కుకుని ఛస్తారని స్పష్టం చేశారు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు.. ఇప్పుడు సిగ్గు, లజ్జ లేకుండా కులదైవం అని చెప్పుకునే తిరుమల స్వామి వారిని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు వాడుకున్నావని చంద్రబాబుపై భూమన మండిపడ్డారు.
టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా చేసినవాళ్లే.. వైసీపీ టైమ్‌లోనూ చేశారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇది అవాస్తవమని బాబు చెప్పగలడా అని ప్రశ్నించారు. కలుషితమైంది నెయ్యి కాదని.. చంద్రబాబు అని విమర్శించారు. నెయ్యికి సంబంధించిన రిపోర్టును టీటీడీ ఈవో బయటపెట్టకుండా.. టీడీపీ ఆఫీసు నుంచి ఎలా బయటపెడతారని ప్రశ్నించారు. తమపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకు అయినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీబీఐతో లేదా, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించే దమ్ము ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు.