టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఐడీ విభాగం డీజీ రవిశంకర్ అయ్యనార్ అనంతపురం చేరుకుని ప్రత్యేక పోలీసు బృందాలకు దిశానిర్దేశం చేశారు. తాడిపత్రిలో సతీశ్ మృతదేహం లభ్యమైన చోట రైలు నుంచి బొమ్మలను కిందకు తోసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఫలితాలను పరిశీలించారు. నిన్న చేసిన ఈ రీకన్స్ట్రక్షన్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఇవాళ మరోసారి రీకన్స్ట్రక్షన్ చేశారు.
చెన్నై – ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మూడు రకాల బొమ్మలను పోలీసులు కిందకు పడేశారు. ఏ 1 కోచ్ డోర్ దగ్గర నుంచి కింద పడితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే దానిపై విచారణ జరిపారు. రైలు బోగీ మెట్ల దగ్గర కూర్చొని ప్రమాదవశాత్తు కిందన పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందని గమనించారు. మరోవైపు సతీశ్ కుమార్ ఫోన్ డేటాను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్లు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
సతీశ్‌కుమార్ రైలులోనే హత్య చేసి కిందకు తోశారా? లేక నడుస్తున్న రైలు నుంచి కిందకు తోసి, హత్య చేశారా అన్న విషయాలను పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సతీశ్‌ది హత్యగా నిర్దారిస్తూ, పరకామణి కేసులో నిందితులుగా ఉన్నవారిని హత్య కేసులో నిందితులుగా చెబుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో సతీశ్ కుమార్ హత్య కేసును వారం రోజుల్లో నిగ్గు తేల్చాలని పోలీసులు ఉన్నతాధికారుల నుంచి దర్యాప్తు చేయిస్తున్నారు. సతీశ్ సెల్‌ఫోన్‌ను అమరావతిలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి, డేటా వెలికి తీయిస్తున్నారు. అలాగే సతీశ్ సీటు నంబర్ 29 కాగా, 11 వ నంబర్‌కు ఆయన బ్యాగ్ ఎలా వచ్చిందనే అంశంపై కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు.