హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు బాధ్యతలను అప్పగించారు. ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. టీటీడీ ఈవో కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతాయుతంగా పనిచేస్తానని, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. ఎక్కడైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని కోరారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం పడుతున్నదని టీటీడీ ప్రకటించింది. రూ.300 ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. సోమవారం కూడా సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.