TTD | తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నాయకుల విజ్ఞప్తి మేరకు వారానికి రెండు సార్లు సిఫారసు లేఖలను టీటీడీ అనుమతిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమేనని టీటీడీ ఈవో శ్యామల రావు క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలతో శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించిందనే వార్తలను ఈవో శ్యామల రావు ఖండించారు. ఈ అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలోని యాదగిరిగుట్ట, ఇతరత్రా దేవస్థానాల్లో ఏపీ ప్రజాప్రతినిధులకు విశిష్ట గౌరవం దక్కుతుందని.. కానీ ఏపీలో మాత్రం తమకు అటువంటి గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ తీరును బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం తప్పుబట్టారు.
ఇలా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించడంపై టీటీడీ పునఃపరిశీలించనుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుందని ఒక వార్త వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు .. అదంటా వట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు.