TTD EO | పాలకమండలి, అధికారుల మధ్య సమన్వయ లోపంతో తొక్కిసలాట జరిగిందనడం అవాస్తవమని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తిరుమలలో సోమవారం బీఆర్ నాయుడు మీడియాతో ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో అనేక మార్పులు చేశామని తెలిపారు. కానీ సామాజిక మాధ్యమాల్లో తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీలో విభేదాలు ఉన్నాయనడం సరికాదని అన్నారు. తాను టీటీడీ చైర్మన్తో విభేదించారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. అందరి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
మరోవైపు టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. టీటీడీపై కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.