తిరుపతి : కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి(ontimitta kodanda ramalayam) బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణా(kalayanotsavam)నికి ఈ నెలాఖరులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్ పిఅన్బురాజన్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఈవో ఆదివారం ఒంటిమిట్ట లో సమీక్ష (reviews)నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ అధికారులు,అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకుని మార్చి 31వ తేదీ లోగా కల్యాణ వేదిక వద్ద సీసీ కెమెరాలు ,కంట్రోల్ రూమ్, బారికేడ్లు , గ్యాలరీలు, విద్యుత్ ఇతర పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 5న సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని వివరించారు.
కల్యాణానికి విచ్చేసే భక్తులు వారు కూర్చునే గ్యాలరీల్లోనే అన్నప్రసాదం ,తాగునీరు, అక్షింతలు అందించే ఏర్పాటు చేస్తామన్నారు. వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ గత ఏడాది 3500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈసారి 4వేల మందిని బందోబస్తుకు నియమిస్తున్నామని చెప్పారు. అనంతరం వీరు కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. టీటీడీ జేఈవో వీర బ్రహ్మం, వై ఎస్ ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ , ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్ , టీటీడీ సీఈ నాగేశ్వరరావు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.