తిరుమల : హైదరాబాద్కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి బుధవారం టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లల ( Off Blades Donate) ను విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ( TTD ) చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బ్లేడ్లను అందజేశారు.

చైర్మన్ మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి రూ.1.16 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రోజుకు 40 వేల హాఫ్ బ్లేడ్లను కల్యాణకట్టల్లో వినియోగిస్తున్నామన్నారు. ఒక ఏడాదికి టీటీడీకి సరిపడా బ్లేడ్లను విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని దాతను చైర్మన్ అభినందించారు.
ఈ సందర్భంగా దాత శ్రీధర్ బోడుపల్లి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ తమదేనని అన్నారు. తమ సంస్థ తయారు చేసిన బ్లేడ్లకు యూరప్, అమెరికాతో సహా 52 దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. 7′ఓ క్లాక్ సంస్థ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణకట్ట ఏఈవో రమాకాంత్ పాల్గొన్నారు.