తిరుపతి: తిరుమల కొండతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆస్తులకు కాపాడేందుకు టీటీడీ నడుం బిగించింది. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు, భూములు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకు జియో-ఫెన్సింగ్‌కు వెళ్లాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సంబంధ అధికారులతో భూఆస్తులతోపాటు టీటీడీ ఆస్తుల స్థితిగతులపై టీటీడీ జేఈవో సదా భార్గవి సమీక్ష చేపట్టారు. జియో సర్వే, మ్యాపింగ్, ఫెన్సింగ్ టెక్నిక్‌లతో పాటు జియో ఫెన్స్‌పై హైదరాబాద్‌లోని నీర్ ఇంటరాక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జయశంకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
దురాక్రమణల నివారణకు టాస్క్‌ఫోర్స్ బృందం నిరంతరం సమీక్షించాలని, తనిఖీలు చేయాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను నిరోధించే చర్యల్లో భాగంగా అన్ని టీటీడీ ఆస్తుల సరిహద్దుల్లో మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయం, వ్యవసాయేతర భూములు కలిపి మొత్తం 7,753 ఎకరాల్లో టీటీడీకి 987 ఆస్తులు ఉన్నాయి. గతేడాది డిసెంబర్లో టీటీడీ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం 5,961 ఎకరాల వ్యవసాయేతర ఆస్తులు వినియోగంలో లేవు. ఇవి ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. టీటీడీ ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, సీఏఓ శైలేంద్ర, ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఎస్టేట్ స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున, టాస్క్‌ఫోర్స్ టీమ్ హెడ్ లలితాంజలి తదితర అధికారులు సమీక్షకు హాజరయ్యారు.