తిరుపతి కౌంటర్ల వద్ద మంగళవారం జరిగిన తోపులాటపై కొన్ని పత్రికలు తమను దుర్మార్గులుగా చిత్రీకరించాయని, అది చాలా విచారకరమని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తామేదో పేద ప్రజలకు దూరం చేశారని లేనిపోని అభాండాలు వేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామని తెలిపారు. సర్వదర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం తాము అన్ని చర్యలూ తీసుకున్నామని, భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తాము ముందుగానే ఊహించామని కూడా తెలిపారు. అందుకే తాము అన్ని రకాల చర్యలూ తీసుకున్నామని ఆయన వివరణ ఇచ్చారు.
తాము అన్ని చర్యలు తీసుకున్నా.. టిక్కెట్లు దొరకవన్న భక్తుల సౌకర్యం విషయంలో తామేమీ చేయలేదని, తాము ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించి, అన్ని చర్యలూ చేపడితే.. తమపైనే నిందలు వేస్తారా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో టోకెన్ లేకుండా కూడా దర్శనాలకు అనుమతించామని, భక్తుల వద్దకే బస్సులను కూడా పంపించామని వివరించారు. ఈ నెల 9,10,11 తేదీలకు సంబంధించి, ఒక్క రోజులోనే టిక్కెట్లను పంపిణీ చేశామని, వారాంతాల్లో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందన్నారు.