Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి మూడురోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవస్థానం విజ్ఞప్తి మేరకు జిల్లా పోలీసుశాఖ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా, ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ ఆదేశాల మేరకు చంద్రావతి కల్యాణ మండపంలో స్థానిక సీఐ జీ ప్రసాదరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈవో ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రాన్ని ప్రతీ రోజు వేలాది సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారన్నారు. అందుకే భద్రత అనేది ఎంతో ప్రాముఖ్యత గల అంశమని తెలిపారు. భద్రతా సిబ్బంది విధి నిర్వహణను భగవంతుడి సేవగానే భావించాలని సూచించారు.
విధుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. అప్పుడే క్షేత్రానికి వచ్చే భక్తులు సంతృప్తికరమైన సేవలు పొందుతారన్నారు. క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడిని అతిథిగానే భావించాలని.. ఆయా ప్రదేశాల్లో సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. భక్తులు అడిగే సాధారణ సమాచారాన్ని సైతం అందివ్వాలని కోరారు. క్షేత్ర పవిత్రతను కాపాడే బాధ్యత సైతం భద్రతా సిబ్బందిపై ఉంటుందన్నారు. టోల్ గేట్ వద్ద పకద్బందీగా తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ఆలయంలో దర్శన క్యూలైన్ల నిర్వహణ, రద్దీ క్రమబద్ధీకరణ, వాహనరాకపోకలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఉత్సవాల సమయంలో ఉండే భక్తుల రద్దీని అనుసరించి భద్రతా సిబ్బంది మరింత జాగ్రత్తగా డ్యూటీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. గ్రామోత్సవం, ప్రభోత్సవం, రథోత్సవాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికబద్ధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని అమలు విషయంలో పలు అంశాలను వివరించారు. భద్రతా సిబ్బంది అంతా క్రమశిక్షణతో మెలుగుతూ విధులపై భక్తిశ్రద్ధలు కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా ఎవరికివారు స్వీయ నియంత్రణ పాటించాలి, సంయమనం ఉండాలని.. ఆవేశానికి లోనుకాకుండా ఉండాలన్నారు. భద్రతా సిబ్బందికి వ్యాయామం అవసరమన్నారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు కే అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.