అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తరగతి గదిలోకి వెళ్తున్న ఉపాధ్యాయురాలి పై క్రేన్ కూలి(Crain Collapse) మృతి చెందారు. అనకాపల్లి జిల్లా (Anakapalli District) పాయకరావుపేట మండలం రాజానగరంలోని ఉన్నత పాఠశాలలో కళావేదిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
శుక్రవారం కళావేదికను క్రేన్ సహాయంతో స్లాబ్ వేసేందుకు సామగ్రి పైకి తరలిస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు క్రేన్ కూలింది. అదే సమయంలో ఇంగ్లిష్ టీచర్ (English Teacher) జోష్నా భాయ్(45)పై సామగ్రి పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు.
దీంతో కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.