అమరావతి : ఏపీలో అనంతపురం(Anantapur) జిల్లా కొందుర్పి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న భద్రకుంట నీటికుంట (Pond) వద్ద బహిర్భూమికి వెళ్లిన 6వ తరగతి విష్ణు అనే విద్యార్థి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన నవీన్(23) అనే యువకుడు సైతం నీటికుంటలో మునిగి చనిపోయాడు.
స్థానికుల సమాచారంతో గ్రామస్థులు కుంటలో గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి ఒడ్డుకు చేర్చారు. గ్రామస్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.