తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత అంగప్రదక్షిణం చేసే భక్తులకు రేపు శనివారం టోకెన్లు జారీ చేస్తున్నామని వెల్లడించింది . తిరుమలలో వివిధ పద్ధతుల్లో మొక్కులు తీర్చుకునే భక్తుల్లో కొందరు అంగప్రదక్షిణంతో తమ మొక్కులను తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇటువంటి భక్తుల కోసం తిరుమల సంప్రదాయాలను అనుసరిస్తూ అంగప్రదక్షిణం పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
మార్చి నెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అంగప్రదక్షిణం కోసం శనివారం ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో టోకెన్లు జారీ చేయనున్నారు. కావాల్సిన భక్తులు ఈ టోకెన్లు పొందే అవకాశం ఉందని ప్రకటించారు. అంగప్రదక్షిణం చేయాలనుకొనే భక్తులు టోకెన్లు తీసుకునే వారికి ప్రత్యేకంగా ఎంట్రీ సమయం టీటీడీ నిర్ణయించి సమాచారం అందజేస్తుంది. భక్తులకు కేటాయించిన సమయం రోజున ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసిన పిదప స్వామి వారి సుప్రభాత సేవ ప్రారంభమైన తరువాత స్త్రీలకు ముందుగా అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
వీరి ప్రదక్షిణ పూర్తయిన తరువాత పురుష భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రీవారి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేరుకోవాలని పేర్కొన్నారు.