తిరుమల : తిరుమల (Tirumala) లో పర్యావరణ సమస్యలతో పాటు వాహనాల రాకపోకలు నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా తిరుమల ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టిఐటిఎంఎస్) తక్షణమే అవసరమని టీటీడీ (TTD) అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సీవీఎస్వో శ్రీధర్, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ (Traffic) నిర్వహణపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
ట్రాఫిక్ నిర్వహణకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేయాలని పేర్కొన్నారు. టీటీడీ కాప్స్, తిరుమల పోలీస్, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, ఏపీఎస్ఆర్టీసీ, ఇంజినీరింగ్, రెవెన్యూ, జీఎం ట్రాన్స్పోర్ట్ సభ్యులుగా ఉన్న కో-ఆర్డినేషన్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలను అంచనా వేసి వారంలోగా సిఫార్సులు అందజేయాలని కోరారు.
తిరుమలలో ట్రాఫిక్ రద్దీ పాయింట్లయిన గోకులం, ఏటీసీ, రాంభగీచా, తదితర ప్రాంతాలను గుర్తించాలని, దర్శనం వచ్చే భక్తుల కోసం నిర్దిష్ట మార్గాలు , పార్కింగ్ స్థలాలను కేటాయించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి అదనపు బలగాల కేటాయింపు, అన్ని భవిష్యత్ నిర్మాణాలలో, మల్టీ-లెవల్ పార్కింగ్ సౌకర్యాలు తప్పనిసరి చేయాలని అన్నారు. డిజిటల్తో ట్రాఫిక్, పార్కింగ్ అప్డేట్ల కోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ను తయారు చేయాలని వెల్లడించారు.