తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి చెంత ఉన్న స్విమ్స్ ఆసుపత్రికి ( SVIMS Hospital) ముంబైకి చెందిన జీన్ అండ్ బోమని ఎ దుబాష్ ఛారిటీ ట్రస్ట్ రూ. 50 లక్షలు విరాళంగా అందజేసింది. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో జె శ్యామలరావు (EO Shyamala rao) చాంబర్లో ఆ ట్రస్ట్ ప్రతినిధి చంద్రశేఖర్ చెక్కును ఈవోకు అందజేశారు. గతంలో కూడా ఈ ట్రస్ట్ వివిధ సందర్భాలలో స్విమ్స్‌కు ఏడు కోట్లు విరాళంగా అందించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లులో స్వామివారి దర్శనానికి వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 73,619 మంది భక్తులు దర్శించుకోగా , 25,112 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.35 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.