Tirupati Stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం నారా చంద్రబాబు నాయకుడు క్షేత్రస్థాయిలో సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు ఇద్దరు అధికారుల బాధ్యులుగా పేర్కొంటూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. డీఎస్పీ రమణకుమార్, ఎస్వీ గోశాల డైరెక్టర్ హరనాథ్రెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో, టీటీడీ సీఎస్ఓలను బదిలీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆరుగురు మృతుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5లక్షల సాయం చేయనున్నట్లు తెలిపారు. బాధితుల ఆరోగ్యం మెరుగయ్యే వరకు వైద్య ఖర్చులు భరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గాయాలైన 33 మందికి రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.