తిరుమల : పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజనంలో భాగంగా ఆదివారం తిరుమల (Tirumala) వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం (Tirumanjanam ) వైభవంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం మలయప్పస్వామిని, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. స్నపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో సురేంద్ర, పేష్కర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 10 గంటల సమయం
తిరుమల : తిరుమలలో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 17 కంపార్టుమెంట్లలో (Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,179 మంది భక్తులు దర్శించుకోగా 25,602 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లు వచ్చిందని వెల్లడించారు.