Tirumala Vaikunta Dwara Darshanam | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈసారి సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత కల్పించినట్లు స్పష్టం చేశారు.
వైకుంఠ ద్వార దర్శనానికి పది రోజుల్లో 182 గంటల దర్శన సమయం ఉండగా.. అందులో 164 గంటలు సాధారణ భక్తులకే ప్రత్యేకంగా కేటాయించినట్లు టీటీడీ తెలిపారు. మొదటి మూడు రోజుల పాటు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు 15 వేల రూ.300 దర్శన టికెట్లు, వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్లను రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తున్నట్లు చెప్పారు.
ఇక తొలి మూడు రోజులు ( డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ) ఈ డిప్ ద్వారా దర్శనాలకు అనుమతించనున్నారు. ఈ టికెట్లకు సంబంధించిన నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించనున్నారు. డిసెంబర్ 2వ తేదీన లాటరీ విధానంలో ఎంపికైన వారికి టోకెన్లు జారీ చేస్తారు. స్థానికుల కోసం కూడా ఈసారి ప్రత్యేక కేటాయింపులు చేశారు. జనవరి 6, 7, 8వ తేదీల్లో రోజుకు 5వేల టోకెన్లు కేటాయించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో ఏడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.