హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లకీడిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. లకీడిప్లో టికెట్లు పొందిన భక్తులు 23వ తేదీ మధ్యాహ్నాం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు వరుసగా సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరుగనున్నది.
ఇవి కూడా చదవండి
మంత్రి శ్రీధర్‌బాబుతో శ్రీలంక మంత్రి భేటీ
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల సహాయ మంత్రి సదాశివన్ వియలందేరన్ ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశయ్యారు. తెలంగాణ నుంచి శ్రీలంకకు ఎగుమతి చేయదగ్గ ఉత్పత్తులపై ఈ భేటీలో చర్చించారు. ఇప్పటికే మన రాష్ట్రం నుంచి ఔషధాలు, ఆర్గానిక్ కెమికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలు, విద్యుత్తు యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, కెనడా, యూఏఈ, సౌదీ అరేబియా, జర్మనీ, బంగ్లాదేశ్ తదితర దేశాలు మన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి.
బీఏ యానిమేషన్లో ప్రవేశాల గడువు పెంపు
హైదరాబాద్, ఆగస్టు18 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కాలేజీలో నూతనంగా ప్రవేశపెట్టిన బీఏ యానిమేషన్ కోర్సులో ప్రవేశాల గడువును 24 వరకు పెంచారు. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సైదులు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. వరుసగా వచ్చిన సెలవుల నేపథ్యంలో దరఖాస్తుల గడువును పెంచామని తెలిపారు. వెబ్సైట్ https: // mjptbcwreis.telangana.gov.inలో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలకు 9032 644463, 9063242329 ఫోన్ నం బర్లలో సంప్రదించాలని సూచించారు.