Tirumala | భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. నిన్న, మొన్నటి వరకు సర్వదర్శనానికి కనీసం 18 గంటల సమయం పట్టగా.. ఇప్పుడు 6 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఉచిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. రూ. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
సోమవారం నాడు తిరుమల శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,697 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్లుగా ఉంది.
అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవ 8వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలను అనుమతించమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరింది.