తిరుమల : తిరుమలలో (Tirumala) ఆధ్యాత్మిక, పర్యావరణ , వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యత, సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కసరత్తు చేస్తుందని టీటీడీ ఈవో జె శ్యామలరావు (TTD EO ) తెలిపారు. గత ఆరు నెలలుగా టీటీడీ చేపట్టిన కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047 (Vision-2047) ను దృష్టిలో పెట్టుకుని ఆధునిక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని ప్రకటించారు.
ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో మీడియాతో సమావేశంలో మాట్లాడారు. తుడా మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 2017 సంవత్సరం గణాంకాల ఆధారంగా ప్రస్తుత అవసరాలకు వసతులు సరిపోవడం లేదని అన్నారు. ప్రస్తుత , భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం ద్వారా విజన్ 2047ను లక్ష్యంగా 18 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికను అందించడానికి ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానించామని తెలిపారు.
గడిచిన ఆరు నెలల్లో లడ్డూ ప్రసాదం రుచిని పెంచడం, నెయ్యి పరీక్షలు చేయడం, బయటి ల్యాబ్‌లలో ముడిసరుకు నాణ్యతను మెరుగుపరచడం, కంపార్ట్మెంట్లలో భక్తులకు నాన్‌స్టాప్ అన్నప్రసాదాలను అందజేస్తున్నామని వెల్లడించారు . తిరుమలలోని హోటళ్లలో రుచికరమైన వంటకాలు, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం వంటివి చేపట్టామని వివరించారు.
తిరుమలలోని దాతల విశ్రాంతి గృహాలకు దేవుళ్ల పేర్లను మాత్రమే ఉంచాలని నిర్ణయించుకున్నాం చెప్పారు. టీటీడీ సేవల్లో పారదర్శకత , సామర్ధ్యం పెంపొందించి, అనేక మంది యాత్రికుల కోసం వసతి, దర్శనం , ఇతర సేవలను వేగవంతం చేయడానికి మాన్యువల్ కార్యకలాపాలకు బదులుగా ఆటోమేషన్ కోసం ఆలోచిస్తున్నామని వివరించారు. యాత్రికుల సేవ కోసం ఏఐ (AI )చాట్‌బాట్‌ను కూడా పరిచయం చేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు.