తిరుపతి : ఈనెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు (Tiruchanur ) పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు (Brahmotsavam) ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు (TTD EO) అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం రోజు భక్తులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్లలో ఉండే వేచి ఉండే భక్తులకు సౌకర్యవంతంగా మంచినీరు, అల్పాహారంతో పాటు మరుగుదొడ్లను, అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఆరోగ్యశాఖ అధికారులు పారిశుద్ధ్యం (Sanitation) విషయంలో జాగ్రత్తలు తీసుకుని స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
వైద్య విభాగం అధికారులు ప్రథమ చికిత్స కేంద్రాలను, అంబులెన్సులను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులందరికీ అన్నప్రసాదం విరివిగా అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించే స్టేజ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నాణ్యమైనవిగా ఉండాలని సూచించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వైట్ వాష్, కలర్ పెయింటింగ్, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 19 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 60,803 మంది భక్తులు దర్శించుకోగా 21,930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.27 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.