తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న జరుగనున్న రథసప్తమిని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ( Koil Alwar Thirumanjanam) వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
ఆలయంలో ఏడాదికి నాలుగు సార్లు రథసప్తమి, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు (Bramotsavam) ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు.
8 పరదాలు అమ్మవారికి బహుకరణ
హైదరాబాద్కు చెందిన వెంకట రామ ప్రసాద్ శర్మ దంపతులు పద్మావతి అమ్మవారి ఆలయంలో 8 పరదాలను బహుకరించారు. ఈ పరదాలను డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చకులు బాబు స్వామికి దాత అందజేశారు.