తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan) కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్యామల రావు ( TTD EO Shyamala rao ) తెలిపారు.
తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు (Timeslot Tokens) జారీ చేస్తామని వెల్లడించారు.
91 కౌంటర్ల ద్వారా టోకెన్లు
తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుంచి 1.20 లక్షల టోకెన్లు, తదుపరి రోజులకు ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తామన్నారు.
భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమల స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఈవో వివరించారు.
కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
రూ.300ల ప్రత్యేక ప్రవేశదర్శనానికి 1.40 లక్షల టికెట్లను విడుదల చేశామన్నారు. శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1500, మిగిలిన 9 రోజులలో రోజుకు 2000 టికెట్లు , గదుల కోటాను డిసెంబరు 23న ఆన్లైన్లో విడుదల చేశామని వివరించారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహాలఘు దర్శనం ఉంటుందని చెప్పారు.
ఆన్లైన్లో (Online) దర్శనం బుక్ చేసుకున్న దాతలను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తామన్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదని పేర్కొన్నారు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చని సూచించారు.