ప్రకాశం జిల్లా : క్షుద్రపూజలు చేస్తున్నాడన్న అనుమానం కాస్తా పెనుభూతంగా మారడంతో ముగ్గురిని బలి తీసుకున్నది. చేతబడి చేశాడన్న అనుమానంతో సొంత బాబాయి కుటుంబాన్నే దారుణంగా కొట్టి చంపాడో యువకుడు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే తనపై చేతబడి ప్రయోగించాడని ఆ యువకుడు నమ్మి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో వెలుగు చూసింది.
వివరాల్లోకెళ్తే.. గిద్దలూరు మండలం కొత్తపల్లికి చెందిన తిరుమలయ్య కుటుంబాన్ని అతడి అన్న కుమారుడు కుక్క మల్లికార్జున యాదవ్ ఈ నెల 12 న రాళ్లతో కొట్టిచంపాడు. బాబాయ్ తనపై క్షుద్ర పూజలు చేస్తూ తన ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని మల్లికార్జున గత కొంతకాలంగా అనుమానిస్తున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తిరుమలయ్య భార్య ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తిరుమలయ్యతోపాటు ఆయన కుమార్తె స్వప్న తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కర్నూలు దవాఖానలో చికిత్స పొందుతూ తిరుమలయ్య చనిపోగా.. స్వప్న గుంటూరు దవాఖానలో చికిత్స పొందుతూ 9 రోజుల తర్వాత కన్నుమూసింది. స్వప్న ప్రస్తుత 6 నెలల గర్భవతి.
సొంత బాబాయి కుటుంబాన్ని హతమార్చిన తర్వాత మల్లికార్జున యాదవ్ కనిపించకుండా పోయాడు. కేసు నమోదు చేసుకున్న గిద్దలూరు పోలీసులు మల్లికార్జున కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఓ స్వామి చెప్పిన మాటలు నమ్మిన మల్లికార్జున.. చిన్నాన్న, ఆయన కుటుంబాన్ని హతమార్చడం గిద్దలూరులో చర్చనీయాంశమైంది.