Madanapalle | ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి పలు ఫైల్స్ దగ్ధం కావడం సంచలనంగా మారింది. ఇది అగ్ని ప్రమాదం కాదని.. కావాలని చేసినట్లు ఉందని డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆ సమయంలో అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులను విచారిస్తున్నారు.
ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్న పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడైన శశిధర్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 8 గంటల పాటు సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని 4 బాక్సుల్లో భద్రంగా ఏపీకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవడం విశేషం.