అనంతపురం: నకిలీ పంచ లోహ విగ్రహాలను అమ్ముతూ పలువురిని మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇత్తడితో తయారు చేసిన విగ్రహాలను పంచలోహాలుగా నమ్మిస్తూ మోసం చేస్తూ పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. వీరి నుంచి 12 ఇత్తడి విగ్రహాలు, రూ.5,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా మిడుతూరు మండలానికి చెందిన ముల్లా అక్బర్ బాషా, పాణ్యానికి చెందిన పిక్ అక్బర్, బనగానపల్లికి చెందిన శాలిబాషాలు ముఠాగా ఏర్పడి మంగళవారం రాత్రి తాడిపత్రిలో పంచలోహ విగ్రహాలుగా పేర్కొంటూ ఇత్తడి విగ్రహాలను విక్రయించేందుకు ప్రయత్నించారు. వీరి వద్ద ఉన్న 12 నకిలీ పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
అలాగే, తాడిపత్రిలో సజ్జల దిన్నె సమీపంలో మట్కా నిర్వహిస్తున్న 14 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5,76,000 నగదు, 15 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఓబులేసు, ఇమామ్వలి, హాజీ ముస్తఫాతో పాటు మరో 11 మంది ఉన్నట్లు డీఎస్పీ చైతన్య వెల్లడించారు.