Srisailam | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి ప్రసాదంలో ఎముక వచ్చినట్లు ఓ భక్తుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తవం అని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మారండేయశాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ తెలిపారు. పాకశాలలో తయారు చేసే రోజూవారి ప్రసాదాలు నియమ నిష్ఠలతో, శుచీశుభ్రతలతో ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల పాకశాలలో పులిహోర ప్రసాదంలో ఎముక వచ్చిందనేది వాస్తవం కాదన్నారు.ఈ ఘటన తమకు ఎంతో మనోవేదనకు గురి చేసిందన్నారు. దీనిపై పలు అనుమానాలు కూడా ఉన్నాయన్నారు.
శ్రీశైల క్షేత్ర ప్రతిష్ఠను దెబ్బతీసి భక్తుల మనోభావాలను కించపరిచేందుకే ఇలాంటి వార్తలు వస్తున్నాయని మారండేయ శాస్త్రి, గంటి రాధాకృష్ణ శర్మ చెప్పారు.. ఇలాంటి ఘటనలపై భక్తులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. ఆలయంలో తీసుకున్న పులిహోర ప్యాకెట్ కనిపించిన గుర్తు తెలియని వస్తువులను ఎముకలుగా భావించి భక్తుడు ఫిర్యాదు చేశారన్నారు. రోజు వారీగా ప్రసాదాల తయారీ కూడా ప్రధాన అర్చకుల పర్యవేక్షణలోనే జరుగుతుందన్నారు.
భక్తుడు దాల్చిన చెక్క ముక్కలను చూసి ఎముకలుగా భావించారని.. ఆలయ కమిటీ విచారణలో ఆయన మాటలు అబద్ధమని తేలిందని ఆలయ ప్రధానార్చకులు మారండేయశాస్త్రి, గంటి రాధాకృష్ణశర్మ తెలిపారు. శ్రీశైలం ఆలయంలో ప్రసాదాల తయారీలో ఎప్పుడూ ప్రామాణికమైన నిర్వహణ విధానాలు పాటించడం వల్ల ఇలాంటి అపవిత్ర చర్యలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా దేవి పవిత్ర పుణ్యక్షేత్రం అయిన.. ఈ చారిత్రాత్మకమైన శ్రీశైలం పవిత్రతను కాపాడటానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని చెప్పారు. శ్రీశైలం దేవస్థానం నిర్వహణను విశ్వసించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ ఈవో పెద్దిరాజు విజ్ఞప్తి చేశారు.