అమరావతి : ఈసారి ఏపీలో 2.O జగన్ను చూస్తారని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan) అన్నారు. విజయవాడ వైసీపీ(YCP) కార్పొరేటర్లతో తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇకపై తన పనితీరు వేరుగా ఉండబోతుందని , కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ కాపాడుకుంటానని స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూపిస్తానని అన్నారు.
వైసీపీ మళ్లీ అధికారంలో రాబోతుంది. 30 ఏళ్లు అధికారంలో ఉండబోతున్నామని ధీమాను వ్యక్తం చేశారు. చంద్రబాబు (Chanda Babu) వైసీపీ కార్యకర్తలను కష్టాలకు గురి చేశారని, వారి బాధలను చూశానని తెలిపారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడుతానని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు ( Private Cases ) పెట్టుతామని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, దొంగ కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం చేస్తారని, వీటిని తట్టుకొని నిలబడినప్పుడే నాయకులుగా ఎదుగుతారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయని వెల్లడించారు. రాజకీయాలు విలువలు, విశ్వసనీయతపై ఆదారపడి ఉంటుందని అదే విలువలపై వైసీపీ ఉంటుందని అన్నారు. వైసీపీ పాలనలో అన్నివర్గాలకు న్యాయం చేశామని గుర్తు చేశారు. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంటిలోనూ జరుగుతుందని పేర్కొన్నారు.