Buddha Venkanna | వైసీపీ నాయకులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నవారంతా దండుపాళ్యం బ్యాచ్ అని ఆయన విమర్శించారు. వాళ్ల పాలనలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని.. అందుకే ఇప్పుడు రికార్డులను తగులబెడుతున్నారని మండిపడ్డారు. ఒక్క శాఖలో అయినా అవినీతి జరగలేదని చెప్పగలరా అని మాజీ సీఎం వైఎస్ జగన్కు ఛాలెంజ్ విసిరారు.
అవినీతీ చేశారు కాబట్టే వివిధ శాఖల్లోని ఫైళ్లను తగులబెడుతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొందరు అధికారులతో వైసీపీ నాయకులు కుమ్మక్కై దోచుకున్నారని విమర్శించారు. అప్పుడు అవినీతి చేసి.. ఇప్పుడు దమ్ముంటే పట్టుకోండని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనలో పరిశ్రమలు అన్నీ తరలిపోయాయని అన్నారు. జగన్ను చూసి భయపడి ఒక్కరూ కూడా ఏపీకి రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబును చూసి పెట్టుబడిదారులు మళ్లీ ఏపీకి వస్తున్నారని తెలిపారు. తాము చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పుకోవడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని అన్నారు.
వైసీపీ పాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలే జరిగాయని బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారని, ఆయన అడుగుజాడల్లో ఆ పార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారని విమర్శించారు. ఫలానా శాఖలో మేం దోచుకోలేదని చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ శాఖల్లో కీలక దస్త్రాలు దగ్ధమవ్వడం ఏంటో విచిత్రం ఉందని అన్నారు. ఇది ఎవరికీ అర్థం కాని జగన్ ఆర్ట్ అని ఎద్దేవా చేశారు. తమ అవినీతి బయటపడకుండా ఉండేందుకే ఇలా ఫైళ్లను దగ్ధం చేస్తున్నారని మండిపడ్డారు.