హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు అష్టాదశ పాదపద్మారాధన, తిరుప్పావడై, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయనున్నారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకే అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబర్ 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.